కొన్ని కొన్ని పాటల్ని వింటే అవి ఎంత స్ఫూర్తినిస్తాయో ఈ పల్లవి చూస్తే తెలుస్తుంది.
“మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది” || మౌనంగానే ||
పై పల్లవిలో అర్థం
“అపజయాలన్నీ వేసవి మండుటెండలో ఎండుటాకులనుకుంటే
వసంతం చిగురులు వేయిస్తూ విజయ బావుటాలు ఎగురవేయిస్తుంది.”
అని కూడ చెప్పుకోవచ్చు.
చరణం 1:
” దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా !
భారమెంతో ఉందని బాధ పడకు నేస్తమా
బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా ! “
” సాగర మథనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృత మిచ్చింది
అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది
కష్టాల వారధి దాటిన వారికి సొంతమౌతుంది
తెలుసుకుంటే సత్యమిది
తలచుకుంటే సాధ్యమిది ” || మౌనంగానే ||
చరణం 2:
” చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో
మార్చలేనిదేదీ జగతిలో లేదని గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో
మారిపోని కథలే అవనిలో లేవని గమనించుకో
తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు
నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి
మా ధైర్యాన్ని దర్శించే దైవాలే తలదించగా (2) “
” మా సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి
అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి ” || మౌనంగానే ||
ఈ పాట “నా ఆటొగ్రాఫ్ స్వీట్ మెమొరీస్” చిత్రం లోనిది
రాసినవారు: చంద్ర బోస్
పాడినవారు: చిత్ర,
సంగీతం సమ కూర్చినది: కీరవాణి
0 స్పందనలు నుండి “మౌనంగానే ఎదగమని…” కు